రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కీలక తీర్పు
  • నమోదు కాని ఒప్పందాలకూ రేరా రక్షణ
  • ఆలస్యమైన ప్రాజెక్టులపై రేరా కొరడా
  • 30 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆదేశం
హైదరాబాద్‌లో ఆలస్యమవుతున్న ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రేరా (TSRERA) సంచలన తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లేనంత మాత్రాన హోమ్‌బయర్లు తమ హక్కులను కోల్పోరని స్పష్టం చేసింది. గణనీయంగా డబ్బు చెల్లించి, ఫ్లాట్లను కేటాయించుకున్న వారు 'అలాటీ'లుగానే పరిగణించబడతారని, వారి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత డెవలపర్‌పై ఉందని తేల్చిచెప్పింది.

హైదరాబాద్ కొంపల్లిలో ఓ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుగోలు చేసిన పలువురు బాధితులు రేరాను ఆశ్రయించారు. 2020-22 మధ్య ఫ్లాట్లు బుక్ చేసుకున్నామని, రెండు, మూడేళ్లలో ఇస్తామన్న డెవలపర్ ఐదేళ్లు గడిచినా నిర్మాణం పూర్తి చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాణం నెమ్మదిగా సాగుతోందని, డబ్బు వాపసు అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు.

ఈ ఫిర్యాదులపై విచారణ సందర్భంగా డెవలపర్ తన వాదన వినిపించారు. కొందరు కొనుగోలుదారులతో అధికారికంగా సేల్ అగ్రిమెంట్లు లేనందున వారు అలాటీలు (ఫ్లాట్ అలాట్ మెంట్ పొందినవారు) కాదని పేర్కొన్నారు. మరికొన్ని ఒప్పందాలు అసంపూర్తిగా ఉన్నాయని, ఇంకొందరు పెట్టుబడిదారులు మాత్రమేనని, ఇది సివిల్ వివాదం కిందకు వస్తుందని వాదించారు.

డెవలపర్ వాదనలను తెలంగాణ రేరా తోసిపుచ్చింది. రేరా చట్టంలోని సెక్షన్ 2(d) ప్రకారం, డబ్బు చెల్లించిన రసీదులు, అలాట్‌మెంట్ పత్రాలు ఉన్నందున వారంతా అలాటీలేనని స్పష్టం చేసింది. రిజిస్టర్డ్ ఒప్పందం లేకపోవడం హక్కులను నిరాకరించడానికి కారణం కాదని తేల్చిచెప్పింది. వెంటనే ప్రాజెక్టును పూర్తి చేసి, 30 రోజుల్లో దశలవారీగా నిర్మాణ షెడ్యూల్‌ను కొనుగోలుదారులకు అందించాలని ఆదేశించింది. అనుమతులు లేకుండా నిర్మించిన ఫ్లోర్లలోని వారికి 30 రోజుల్లోగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రత్యామ్నాయ ఫ్లాట్లు కేటాయించాలని, లేనిపక్షంలో పూర్తి డబ్బు వాపసు చేయాలని తీర్పులో పేర్కొంది.

బుకింగ్ సమయంలో ఇచ్చిన 36 నెలల గడువుకు చట్టబద్ధమైన ప్రాధాన్యత ఉంటుందని రేరా నొక్కిచెప్పింది. ఈ తీర్పు, నమోదు కాని ఒప్పందాలను సాకుగా చూపి తప్పించుకోవాలనుకునే డెవలపర్లకు చెక్ పెడుతూ, హోమ్‌బయర్ల హక్కులకు మరింత బలాన్ని చేకూర్చింది.



Telangana RERA
Hyderabad real estate
homebuyers rights
real estate disputes
property registration
flat allotment
RERA Act
real estate project delays
Komapally
property investment

More Telugu News